: సల్మాన్ ఖాన్ ను దుయ్యబట్టిన గాయకుడు అభిజిత్ భట్టాచార్య
పాకిస్తాన్ కళాకారులకు మద్దతుగా మాట్లాడిన బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ తీరును ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య దుయ్యబట్టారు. సల్మాన్ ను విమర్శిస్తూ 57 ఏళ్ల ఈ గాయకుడు ట్విట్టర్ లో కామెంట్లు పోస్ట్ చేశారు. 50 ఏళ్ల నటుడు భారత్ పట్ల విధేయత చూపేందుకు సిగ్గు పడుతున్నాడంటూ ఏకిపారేశారు. సల్మాన్ భారత వ్యతిరేకి అన్నది నిజమేనన్నారు. పాకిస్తాన్ కళాకారులు ఉగ్రవాదులు కారంటూ, కళాకారులకు ఉగ్రవాదాన్ని అంటకట్టవద్దంటూ సల్మాన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18న ఉరీలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ లో నివసిస్తున్న పాకిస్తాన్ కళాకారులు, టెలివిజన్ ఆర్టిస్టులు 48 గంటల్లోగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) గత నెల 23న అల్టిమేటం జారీ చేసింది. దీంతో సల్మాన్ పాక్ కళాకారులకు మద్దతుగా నిలవడంతో వివాదం మొదలైంది. పాకిస్తాన్ కళాకారులంటే సల్మాన్ ఖాన్ కు అంత ప్రేమే ఉంటే ఆ దేశం వెళ్లి పనిచేసుకోవాలని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే చురకలంటించారు. సల్మాన్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లోనూ యూజర్లు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు.