: పాకిస్థాన్ బద్మాష్.. భారత్లో కలిసిపోయి ఆరున్నర దశాబ్దాల నరకం నుంచి బయటపడతామంటున్న పీఓకే పౌరులు
‘‘పాకిస్థాన్ మా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అదో బద్మాష్. ఆరున్నర దశాబ్దాల నరకం నుంచి మాకు స్వేచ్ఛ కావాలి’’ ఈ మాటన్నది ఎవరో తెలుసా? పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పౌరులు. పాక్ నుంచి తమకు స్వేచ్ఛ కావాలని, కశ్మీర్ ఎంతగానో అభివృద్ధి చెందిందని, తాము భారత్తో కలిసిపోతామంటూ పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. పాక్ వైఖరికి నిరసనగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళన రోజురోజుకు ఉద్ధృతం కావడంతో పాక్ సర్కారు కలవరపడుతోంది. పాక్లో భాగంగా ఉన్నా తమకు హక్కులు లేవని, అభివృద్ధి అసలే లేదని వాపోతున్నారు. అందుకే భారత్తో కలిసి ముందుకుసాగుతామని నినదిస్తున్నారు. పీఓకేను పాక్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఉగ్రవాదుల అడ్డాగా మార్చిందంటూ ఇటీవల ఆ ప్రాంతంలో పర్యటించిన అంజుమన్ మినాజ్-ఎ-రసూల్ సారథి మౌలానా సయీద్ దెహ్లావీ ఆరోపించారు. ఈ ప్రాంతానికి వెలకట్టిన పాక్ చైనాకు తెగనమ్మేందుకు సిద్ధమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ ఆగడాలను ప్రశ్నించిన వారికి ప్రభుత్వం, పోలీసులు నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఓకేలోని కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పాక్ పూర్తిగా తన అధీనంలో ఉంచుకుంది. తాను చెప్పినట్టు ఆడేలా తయారుచేసింది. పీఓకేలో ప్రజలకు హక్కులు ఉండవు. అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియని ఈ ప్రాంతంలో రోడ్లు, రైలు మార్గాలు కూడా కనిపించవు. చదువుకునేందుకు బడులు లేవు. చేసేందుకు ఉద్యోగాలు లేవు. దీంతో అశాంతితో రగిలిపోతున్న యువత పాక్కు వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రాణాలు అర్పించి అయినా సరే పాక్ చెర నుంచి విముక్తి సాధించాలని నిర్ణయించుకుంది. మహిళలు, యువత వీధుల్లోకి వచ్చి పాక్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపుతున్నా వారు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.