: పాకిస్థాన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించనున్న భారత్.. ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు రెడీ


ఉరీ ఉగ్రదాడి తర్వాత దాయాది పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేసిన భారత్ ఇప్పుడు మరో రకంగా చిత్తును చేయాలని చూస్తోంది. పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే సర్వసన్నద్ధంగా ఉన్న భారత్ ఇప్పుడు పాక్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. ఆ దేశంతో వాణిజ్య బంధాలను కట్ చేసుకోవాలని భావిస్తోంది. నిజానికి భారత్ కంటే పాకిస్థాన్ ఐదు రెట్లు చిన్నది. ఆర్థిక వ్యవస్థలో మనకంటే ఏడు రెట్లు తక్కువ. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టడం ద్వారా పాక్‌ను మూడుచెరువుల నీళ్లు తాగించాలనేది ప్రధాని మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. ‘స్వీయ రక్షణ కోసం తాపత్రయ పడడం స్వీయ అపరాధమే అవుతుంది’ అన్న కొత్త విధానంతో మోదీ సర్కారు ముందుకెళ్తోందని ఓ భద్రతాధికారి పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య రూ.17.31 వేల కోట్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది. అనధికారికంగా ఇది రూ.33 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మన దేశం నుంచి దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు నగలు, టెక్స్‌టైల్స్, యంత్రాలు వంటివి ఎగుమతి అవుతున్నాయి. అదే మార్గంలో పాక్ నుంచి భారత్‌కు వస్త్రాలు, డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, సిమెంట్ దిగుమతి అవుతున్నాయి. మూడో దేశం ద్వారా పాక్‌తో చేస్తున్న ఇలాంటి వాణిజ్యానికి స్వస్తి చెప్పడం ద్వారా ఆ దేశంపై తీవ్ర ఒత్తడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పాక్‌తో బలమైన సంబంధాలు ఉన్న యూఏఈ వంటి దేశాలను సైతం భారత్ వ్యూహం పునరాలోచనలో పడేస్తుందని అంటున్నారు. తద్వారా పాక్‌పై ఒత్తిడి పెరిగి కుదేలవడం ఖాయమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో పాక్ విలవిల్లాడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దౌత్యపరంగా ఇప్పటికే ఏకాకి అయిన పాక్‌ను ఆర్థికంగానూ నష్టపరచడం ద్వారా తగిన బుద్ధి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి వాణిజ్య సంబంధాలను కట్ చేసుకోవడానికే ప్రధాని మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News