: ‘అప్నా పంజాబ్’.. పంజాబ్‌లో మరో కొత్త పార్టీ.. ప్రకటించిన మాజీ ఆప్ నేత
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ 'ఆవాజ్-ఈ-పంజాబ్ పేరుతో ఓ కొత్త పార్టీని స్థాపించి, అంతలోనే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయదని ఊహించని విధంగా ప్రకటన చేశారు. ఇదిలా ఉంచితే, తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ వచ్చింది. ఆ రాష్ట్ర రాజకీయ నాయకుడు సుచా సింగ్ చోటేపూర్ కొత్త పార్టీ పెట్టారు. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాను పెట్టిన కొత్త పార్టీ పేరు ‘అప్నా పంజాబ్’ అని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు పాటుపడే ఉద్దేశంతోనే ‘అప్నా పంజాబ్’ పెట్టినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. మరోవైపు ఆ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.