: హనుమంతుడికి తనలోని శక్తి ఏమిటన్నది తెలియదు.. ఆ తరువాతే తెలిసింది.. మన ఆర్మీకి కూడా అలాగే వారి శక్తిని తెలిపాను: మనోహర్ పారికర్
పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన తరువాత రక్షణమంత్రి మనోహర్ పారికర్ తొలిసారి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారత సైన్యం చేసిన సాహసాన్ని కొనియాడారు. భారత్‌కు హాని చేయాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పితీరుతామని అన్నారు. తాము ఏ దేశంపై కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించాలని కోరుకోవడం లేదని అన్నారు. రామాయణాన్ని గుర్తు చేసిన మనోహర్ పారికర్ శ్రీరాముడు లంకపై యుద్ధం చేసి గెలిచాడని, అనంతరం ఆ ప్రాంతాన్ని విభీషణుడికి ఇచ్చాడని అన్నారు. భారత్ గతంలో బంగ్లాదేశ్ విషయంలోనూ అదే చేసిందని గుర్తు చేస్తారు. ఎవరికీ హాని తలపెట్టాలని కోరుకోని తాము, ఎవరైనా హాని చేస్తే మాత్రం దీటైన జవాబే ఇస్తామని పారికర్ పేర్కొన్నారు. శత్రువులకు తగిన రీతిలో పాఠం చెబుతామని అన్నారు. భారత్ ఊహించని దాడి చేసిన అంశంపై పాక్ చేస్తోన్న ప్రకటనలపై ఆయన మాట్లాడుతూ... భారత్ పీవోకేలోకి ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చడాన్ని పాక్ ఇంకా నమ్మలేకపోతుందని అన్నారు. సర్జరీ చేయించుకున్న రోగులు కోమాలో ఉండే మాదిరిగా సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత ఆ దేశం ఇప్పటికీ కోమాలోనే ఉందని ఎద్దేవా చేశారు. భారత్ ఇన్నాళ్లూ పాటిస్తూ వచ్చిన శాంతిని మన బలహీనతగా పాకిస్థాన్ భావించకూడదని పారికర్ అన్నారు. మళ్లీ రామాయణాన్ని ఉటంకిస్తూ లంకకు వెళ్లేముందు హనుమంతుడికి తనలో ఉన్న శక్తి ఏంటో తెలియదని, ఆ తర్వాతే తెలిసిందని చెప్పారు. అదేవిధంగా భారత ఆర్మీ శక్తి ఏమిటో తాను వారికి తెలియజేశానని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఆదేశాలతో భారత జవాన్లు వారి కర్తవ్యాన్ని ఎంతో సమర్థవంతంగా పూర్తి చేశారని ఆయన కొనియాడారు.