: ప్రజలు నాకు స్వాగతం పలకడం లేదు.. ప్రత్యేక ప్యాకేజీకి పలుకుతున్నారు: తిరుపతిలో వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా తెచ్చినందుకు తిరుపతిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఈరోజు సన్మానం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తోన్న ఆయన రాకను వ్యతిరేకిస్తూ వామపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. వెంకయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. మరోవైపు బీజేపీ శ్రేణులు తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంకయ్యకు ఘన స్వాగతం పలికి అక్కడినుంచి సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై వెంకయ్య ప్రసంగిస్తూ.. దారి పొడవునా నిలబడి తనకు స్వాగతం పలికారని, ప్రజలు స్వాగతం పలుకుతున్నది తనకు కాదని ప్రత్యేక ప్యాకేజీకి అని చమత్కరించారు. దేశానికి సమర్థవంతమైన నాయకుడు వచ్చారని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథాన దూసుకుపోతోందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో మంచి నాయకత్వం లేదని, ప్రజలు, భగవంతుడి ఆశీర్వాదంతో మోదీ లాంటి నాయకుడు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాటలు మాట్లాడిందని వెంకయ్య అన్నారు. 2004 ఎన్నికలముందు టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని, తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆనాడు చెప్పిందని, మళ్లీ 2014వరకు ఆ మాటే ఎత్తలేదని ఆయన విమర్శించారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు చేయాలంటే తండ్రి ముందుగా మంచి ప్రణాళిక వేసుకొని సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తారని, రాష్ట్ర విభజన మాత్రం ఇష్టం వచ్చినట్లు చేశారని వెంకయ్య అన్నారు. తాను ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాలేదని ఆయన గుర్తుచేశారు. అయినా ఏపీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత తనకుందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధితో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచం అంతా ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పాలించిన 2004 -2014 వ్యవధిలో మనదేశం ఒకడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు.