: సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ కాల్పులు... కశ్మీర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం 4 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో కాల్పులు మొదలు పెట్టిన పాకిస్థాన్ ఇప్పటికీ వాటిని జరుపుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతానికి ఇప్పటికే భారీగా భద్రతా బలగాలు చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాక్ దుస్సాహసానికి దిగుతోంది. ఈ నేపథ్యంలో, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ అక్కడి పరిస్థితిని సమీక్షించడానికి జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. అక్కడి ఆర్మీ అధికారులకు ఆయన పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ తో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.