: ఏపీలో కొలువులే కొలువులు.. 4009 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా


ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు పండగ ముందు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా మొత్తం 4009 పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. నోటిఫికేషన్ వెలువడిన ఆరు నెలల్లోనే పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడలోని గోకవరం మండలం కొత్తపల్లి ఆదర్శ కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపినట్టు తెలిపారు. నెగిటివ్ మార్కుల విధానం వల్ల ప్రతిభావంతులకు మేలు జరిగే అవకాశం ఉందన్న ఆయన గ్రూప్-2, 3 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ పరీక్షల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగిస్తామని, పరీక్షలు సీసీ కెమెరాల నీడలో జరుగుతాయని వివరించారు. అభ్యర్థుల వయో పరిమితిని ఏడాది పెంచే యోచన ఉన్నట్టు తెలిపారు. ఈ పరీక్షల ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News