: బాహుబలి మహావృక్షం... పార్ట్ 3 కూడా ఉంటుంది... 'వర్చువల్ రియాలిటీ'లో బాహుబలిని సరికొత్తగా చూపిస్తాం: దర్శకుడు రాజమౌళి
'బాహుబలి 2' సినిమాను సరికొత్తగా చూపిస్తామని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో 'బాహుబలి 2 కన్ క్లూజన్' లోగోను ఈ సాయంకాలం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్చువల్ రియాలిటీ విధానంలో 'బాహుబలి 2' సినిమాను చూపించనున్నామని చెప్పారు. 'వర్చువల్ రియాలిటీ' విధానంలో చూపించేందుకు 25 కోట్ల రూపాయలు ఖర్చుచేసి 300 థియేటర్లలో వర్చువల్ డివైస్ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ వర్చువల్ గాగుల్స్ ఒక్కొక్కటి సుమారు 2 లక్షల రూపాయల ఖరీదు ఉంటుందని రాజమౌళి తెలిపారు. ఖరీదైన కంప్యూటర్లలో ఈ డివైజ్ ఉంటుందని ఆయన చెప్పారు. 'బాహుబలి2'ను ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఆయన అన్నారు. జనవరిలో 'బాహుబలి' ట్రైలర్ ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ప్రభాస్ బర్త్ డే ను పురస్కరించుకుని ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ఆయన అన్నారు. 'బాహుబలి2'లో హీరోయిన్ అనుష్క అని, తమన్నాతో పాటలు ఉండవని ఆయన తెలిపారు. 'బాహుబలి2'లో తాను చాలా కష్టపడి తీసిన సన్నివేశం యుద్ధం ఎపిసోడ్ అని అన్నారు. రెండున్నర నెలలపాటు యుద్ధాన్ని తీశామని ఆయన చెప్పారు. వర్షం కూడా సహకరించిందని ఆయన తెలిపారు. రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయని ఆయన చెప్పారు. ప్యాచ్ వర్క్ ఇంకా మిగిలి ఉందని, డిసెంబర్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని రాజమౌళి తెలిపారు. 'బాహుబలి బిగినింగ్', 'కన్ క్లూజన్' సినిమాలు 'బాహుబలి' అనే మహావృక్షం నుంచి వచ్చిన కొమ్మలని ఆయన చెప్పారు. 'బాహుబలి 3' కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు.