: ‘నాటు సారా అమ్ముతారా.. లేదా?’.. 11,000ల వాట్ల హైటెన్షన్‌ కరెంట్‌పోల్‌ ఎక్కి మందుబాబు హ‌ల్‌చ‌ల్!


మందుబాబులు వీధుల్లోకి వ‌చ్చి హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న ఘ‌ట‌న‌లు రోజుకోచోట వెలుగులోకొస్తున్నాయి. మ‌ద్యం మ‌త్తులో వీధుల్లోకొచ్చి వీరంగం సృష్టిస్తున్న‌వారు కొంద‌ర‌యితే, పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తూ ఇత‌రుల‌ను అస‌హ‌నానికి గురిచేస్తున్న‌వారు మ‌రికొంద‌రు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌ జిల్లాలో పీకలదాకా తాగిన ఓ మందుబాబు హ‌ల్‌చ‌ల్ చేసిన ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. మద్యం మత్తులో మునిగిన ఓ వ్యక్తి వీధిలోకి వ‌చ్చి హైటెన్షన్‌ కరెంట్‌పోల్ ఎక్కాడు. ఆ స‌మ‌యంలో ఆ ప్రాంతంలో విద్యుత్ నిలిచిపోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. క‌రెంట్ పోల్ ఎక్కిన వ్య‌క్తి రాష్ట్ర‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. నాటుసారా అమ్మ‌కాలు జ‌ర‌పాల్సిందేన‌ని అన్నాడు. ఇటీవ‌లే నాటుసారా అమ్మకంపై అఖిలేశ్ స‌ర్కారు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. 11,000 ల వాట్ల ఆ హైటెన్షన్‌ కరెంట్‌పోల్‌పైనే సుమారు గంటపాటు నానా హంగామా చేశాడు. సమాచారం అందుకున్న ఆ ప్రాంత‌ విద్యుత్‌ శాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని, మందుబాబుని కింద‌కి దిగ‌మంటూ వేడుకున్నారు. అయినా అత‌డు స‌సేమీరా అన‌డంతో కరెంట్‌పోల్‌పైకి నిచ్చెనవేసి బలవంతంగా దించారు. అనంత‌రం పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నాటుసారా ప్రేమికుడి పేరు బుక్కీ అని మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News