: ఉగ్రవాద సంస్థలన్నీ పీవోకేలోనే.. పాక్ సైన్యం నుంచి పూర్తి సహకారం
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌లో నిర్భయంగా తిరుగుతున్న ఉగ్రవాదులు ప్రపంచ దేశాల వెన్నులో వణుకుపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు అధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ మొదటిస్థానంలో ఉన్నట్టు ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక ప్రచురించింది. దీంతో పాకిస్థాన్ సంగతేంటో మరోమారు ప్రపంచానికి తెలిసింది. ఆల్‌ఖైదా నుంచి లష్కరే తాయిబా వరకు ప్రముఖ ఉగ్రవాద సంస్థలకు పాక్ పుట్టినిల్లుగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీవోకేలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థల గురించి ఓసారి తెలుసుకుందాం. ఆల్‌ఖైదా: ఆఫ్ఘనిస్థాన్‌పై రష్యా దురాక్రమణను నిరసిస్తూ 1988లో కొందరు సున్నీ ముస్లిం యువకులు దీనిని ప్రారంభించారు. ఒసామాబిన్ లాడెన్ సారథ్యంలో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికాలో సృష్టించిన మారణహోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా సేనల దాడిలో 2011లో మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది అయిన లాడెన్ హతమయ్యాడు. లాడెన్ హతమయ్యాక ఆల్‌ఖైదా పగ్గాలను జవహరీ అందుకున్నాడు. లాడెన్ సుదీర్ఘకాలం పాటు పాకిస్థాన్‌లోనే ఉన్నాడు. అమెరికా దళాలు ఆయనను హత్య చేసిందీ కూడా అక్కడే. అయినా సరే పాక్ మాత్రం తాము ఉగ్రవాదాన్ని సహించబోమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుండడం గమనార్హం. లష్కరే తాయిబా: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థను 1987లో హఫీజ్ సయీద్ ప్రారంభించాడు. క్రమంగా దక్షిణాసియాలోనే శక్తిమంతమైన ఉగ్రవాద సంస్థగా ఎదిగింది. 2008లో ముంబై దాడులు, 2010లో భారత పార్లమెంటుపై దాడి ఈ సంస్థ పనే. పాకిస్థాన్ వ్యాప్తంగా ఈ సంస్థకు ఉగ్రశిబిరాలు ఉన్నాయి. ఈ సంస్థ సహకారంతోనే పాక్ ప్రభుత్వం కశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. జైషే మహ్మద్: ఈ సంస్థకు పాక్ గూఢచారి సంస్థ మద్దతు ఉంది. కశ్మీర్‌ను ఎప్పటికైనా పాకిస్థాన్‌లో కలపాలనేది ఈ సంస్థ ఏకైక లక్ష్యం. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ సంస్థను ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడితో 2000 సంవత్సరంలో పాక్ రద్దుచేసింది. ప్రస్తుత ఈ సంస్థకు మసూద్ అజర్ సారథ్యం వహిస్తున్నాడు. లష్కరే ఒమర్: లష్కరే తాయిబా, ఆల్‌ఖైదా నుంచి వచ్చిన కొందరు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2002లో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికన్లను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంది. అసదుల్లా నాయకత్వం వహిస్తున్నాడు. అమెరికా జర్నలిస్ట్ డేనియల్ హత్య వెనక ఉన్నది ఈ సంస్థే అన్నది జగమెరిగిన సత్యం. సిఫా-ఎ-సాహబా: పాకిస్థాన్‌లోని సున్నీ ముస్లింల హక్కులు కాపాడడమే లక్ష్యంగా ఈ సంస్థ ఏర్పాటైంది. నవాజ్ జాంఘ్వీ 1985లో ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. పాక్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండడంతో ఉగ్ర కార్యకలాపాల్లో తొలుత రెచ్చిపోయింది. అయితే ఆ తర్వాత పాక్ ప్రభుత్వం దీనిని మూడుసార్లు రద్దు చేసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కశ్మీర్ జిహాదీ ఫోర్స్: భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టి పాక్‌లో కలపడమే ఈ సంస్థ లక్ష్యం. దీనికి కూడా పాక్ అండ పూర్తిగా ఉంది. భారత్‌కు ఉగ్రవాదుల్ని ఎగుమతి చేసేందుకు సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తోంది. వీటితోపాటు చిన్నాచితకా సంస్థలైన జమాత్ ఉల్ ముజాహిదీన్, జమాత్ ఉద్ దవా తదితర సంస్థలు కూడా ఉగ్రవాదుల్ని తయారుచేయడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.