: నేరాలు ఎలా అదుపు చేసిందీ చెప్పిన ఎస్పీ.. శభాష్ అన్న చంద్రబాబు
విజయవాడలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీటీవీల వినియోగంతో అనంతపురంలో నేరాలు ఎలా అదుపు చేసిందీ ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరించారు. ఆయన చెప్పిన తీరుకు ముగ్ధుడైన చంద్రబాబు శభాష్ అంటూ కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీటీవీల ఏర్పాటుకు అవసరమైన నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల నుంచి చలాన్ల రూపంలో వసూలు చేసే డబ్బులో సగం తిరిగి ట్రాఫిక్, సివిల్ పోలీసులకు విధుల నిర్వహణలో కావాల్సిన అవసరాలకే కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో విజిబుల్ పోలీసింగ్ కంటే ఇన్‌విజిబుల్ పోలీసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీమ ప్రాంతాల్లో ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణచివేయాలని పేర్కొన్న చంద్రబాబు, కేసులు వీగిపోకుండా గట్టి ఆధారాలతో కేసులు నమోదు చేయాలని సూచించారు. నేరాల్లో రాష్ట్రం ఆరోస్థానంలో ఉందని, దళిత, గిరిజనులపై 12 శాతం దాడులు జరగడం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వివరించారు.