: పాకిస్థాన్ కి చెప్పే దాడి చేశాం: డీజీఎంవో
లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయని, ఏ క్షణంలో అయినా తాము దాడికి దిగే అవకాశం ఉందని గతంలో పాకిస్థాన్ కు చెప్పామని డీజీఎంవో తెలిపారు. అలాగే తాజాగా సర్జికల్ స్ట్రయిక్స్ పై కూడా సమాచారం ఇచ్చామని అన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో ఈ సంయుక్త దాడులు చేశామని డీజీఎంవో చెప్పారు. అర్ధరాత్రి 12:30 నిమిషాలకు శత్రుదేశం సరిహద్దుల్లోకి దూసుకెళ్లిన మన సైనిక నిపుణులు 4:30 కల్లా వెనుకకు వచ్చేశారు. నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లకు యత్నించే వారికి ఇదొక గుణపాఠమని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిదాడికి పాకిస్థాన్ దిగే అవకాశం ఉందని భావించిన ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దుల్లకు పది కిలోమీటర్లలోపు ఉన్న గ్రామీణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడంలో తలమునకలైంది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించి, పాక్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు గట్టి సమాధానం చెప్పాలని భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే సరిహద్దు గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.