: వైదేహీ కళాశాలలో నోట్ల కట్టలు.. షాక్ తిన్న ఐటీ అధికారులు
బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని వైదేహీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌పై దాడి చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులకు దిమ్మదిరిగింది. కట్టల కొద్దీ బయటపడిన సొమ్మును చూసి షాక్ తిన్నారు. రూ.500, రూ.1000 నోట్లు బయటపడుతున్న తీరు చూసి అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని తరలించేందుకు ఏకంగా ట్రక్కునే రప్పించాల్సి వచ్చింది. మొత్తంగా ఐటీ అధికారుల దాడిలో లెక్కల్లో చూపని, అక్రమ ఆదాయం రూ.43 కోట్లు బయటపడింది. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద దాడిగా అధికారులు చెబుతున్నారు. గతంలో పాండిచ్చేరిలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలపై దాడి చేసిన ఐటీ అధికారులు అప్పట్లో రూ.82 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద దాడి కాగా, తాజా దాడి కర్ణాటకలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. కళాశాలపై దాడి చేసిన అధికారులు డబ్బుతో పాటు పలు పత్రాలను, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా క్యాపిటేషన్ ఫీజు రూపంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మేనని అధికారులు భావిస్తున్నారు. వైదేహీ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడు మరణానంతరం ఆయన కుమార్తె కల్పజ, వైదేహీ కళాశాలను నిర్వహిస్తున్నారు. సంస్థ అక్రమ ఆదాయంపై పక్కా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న ఆదికేశవులు గ్రూప్ కంపెనీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలుపత్రాలతోపాటు భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.265 కోట్లకు ఆదాయపు పన్నులు చెల్లించకుండా లావాదేవీలు నిర్వహించినట్టు అధికారులు అంచనాకొచ్చారు.