: మాకు దేశం ముఖ్యం.. ఆ తర్వాతే సినిమాలు... రాజ్ ఠాక్రేను సల్మాన్ కలవలేదు!: ఎమ్మెన్నెస్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను కలిశారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీ ఖండించింది. ఈ సందర్భంగా చిత్రపట్ సేన అధ్యక్షుడు అమేయ్ ఖోపాక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ కళాకారులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న తమ డిమాండులో ఎలాంటి మార్పు లేదని అన్నారు. తమకు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో స్పెయిన్ లో జరిగిన పారిస్ దాడులను పాక్ నటీనటులు ఖండించి, మృతులకు సంతాపం తెలిపారని ఆయన గుర్తు చేశారు. మరి యురీ ఉగ్రదాడిపై వారెందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. సినిమాకు, కళలకు తాము వ్యతిరేకం కాదని, పాకిస్థాన్ నటులకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. భారత ఛానెళ్లను పాకిస్థాన్ లో నిషేధించారని, బాలీవుడ్ తారల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన తెలిపారు. అలాంటి పాక్ కళాకారుల సినిమాలు అడ్డుకుని తీరుతామని ఆయన తెలిపారు. దేశమే తమకు ముఖ్యమని, దేశం తరువాతే సినిమాలు, కళలు అని ఆయన స్పష్టం చేశారు.