: నా కార్టూన్ బాధకు గురిచేస్తే మన్నించండి: ‘సామ్నా’ కార్టూనిస్ట్
మరాఠా వర్గీయులు చేపట్టిన నిశ్శబ్ద ఉద్యమంపై కార్టూన్ గీసి విమర్శలు ఎదుర్కొంటున్న శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ కార్టూనిస్ట్ శ్రీనివాస్ ప్రభుదేశాయ్ ‘మన్నించండి’ అంటూ ఒక ప్రకటన చేశారు. ‘నేను గీసిన కార్టూన్ మరాఠా వర్గీయులను బాధకు గురి చేసి ఉంటే మన్నించండి. ఎవర్నీ బాధపెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్టూన్ గీయలేదు. నేను కళాకారుడిని. రాజకీయ కార్టూనిస్ట్ ని కాదు. ఈ స్పీడ్ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు తెప్పించేందుకే కార్టూన్ లు వేస్తాను తప్పా, బాధ పెట్టేందుకు కాదు’ అంటూ శ్రీనివాస్ ప్రభు దేశాయ్ పేర్కొన్నారు. కాగా, ఈ కార్టూన్ ప్రచురించడంపై ‘సామ్నా’ కార్యాలయంపై కొందరు వ్యక్తులు నిన్న దాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ తనను మన్నించమంటూ కోరాడు. కాగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపైన, కోపర్టీలో మరాఠా బాలికపై ముగ్గురు దళిత యువకుల అత్యాచారానికి పాల్పడిన ఘటనపైన గత కొన్ని రోజులుగా మరాఠా వర్గీయులు మౌనపోరాటం చేస్తున్నారు.