: నువ్వెంత.. నీ వయసెంత.. బురద రాజకీయాలు చెయ్యొద్దు: జగన్‌పై కళా వెంకట్రావు ఆగ్రహం
హుద్‌హుద్ తుపాను సంభవించిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలోనే బసచేసి అక్కడి ప్రజల కష్టాలను తీర్చడానికి కృషి చేశారని, తాజాగా వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కూడా కృషి చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు ప్రతిపక్షనేతలు పలు విషయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని ఆయన అన్నారు. తిరిగి నోటితో చెప్పలేనటువంటి భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు. అటువంటి సంస్కృతిలో పుట్టి వచ్చిన వ్యక్తి కాబట్టే జగన్ అటువంటి భాష మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ‘నువ్వెంత.. నీ వయసెంత.. నువ్వో ప్రతిపక్ష లీడరుగా ఫెయిలయ్యావ్.. నీ భాష చూస్తే నువ్వెలాంటివాడివో అర్థమవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదు.. ప్రతిపక్షం వరదలతో కూడా బురద రాజకీయం చేస్తోంది. వారి మనసు మొత్తం బురదతో నిండి ఉంది. బురద రాజకీయాలు చెయ్యొద్దు.. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఎన్నో వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది’ అని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.