: ఎయిర్ ఇండియాపై 'ఆఫర్ల' దెబ్బ... రూ. 246 కోట్లు నష్టం
విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్ల వెల్లువ ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాపై పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ రూ. 246 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2015-16 సంవత్సరం క్యూ-1 నష్టం రూ. 316 కోట్లతో పోలిస్తే, గణాంకాలు మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నా, మూడు, నాలుగు త్రైమాసికాలతో పోల్చి చూస్తే, మాత్రం ఇతర కంపెనీల నుంచి వస్తున్న ఆఫర్ల దెబ్బ గట్టిగానే తగిలినట్టు భావించాల్సి వుంది. అటు అంతర్జాతీయ రూట్లలో, ఇటు దేశవాళీ రూట్లలో ఆదాయ వృద్ధి మందగించింది. ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతో, 28 ఎయిర్ లైన్స్ సంస్థల కూటమి స్టార్ అలయన్స్ లో చేరినా, ఎయిర్ ఇండియాకు అనుకున్న ప్రయోజనాలు లభించలేదు. కాగా, ఈ సంవత్సరంలో రెండో అర్ధభాగంలో మరింత ఆదాయం లభిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు కొత్త సర్వీస్, ఢిల్లీ - మాడ్రిడ్ ల మధ్య మరో సర్వీస్ మొదలు కానున్నాయని, కనీసం 10 శాతం పాసింజర్ రెవెన్యూ గ్రోత్ ను అంచనా వేస్తున్నామని సంస్థ అధికారి ఒకరు తెలిపారు.