: అమెరికాలో కాల్పులు జరిపి కలకలం సృష్టించిన భారత సంతతి లాయర్
భారత సంతతికి చెందిన ఓ న్యాయవాది అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో కలకలం సృష్టించాడు. సైనిక దుస్తులు ధరించిన నాథన్ దేశాయ్ (46) అనే ఆ వ్యక్తి నాజీ సానుభూతిపరుడిలా స్వస్తిక్ గుర్తు ధరించి కాల్పులు జరిపాడు. ఘటనలో తొమ్మిది మంది పౌరులు గాయపడ్డారు. పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. నాథన్ దేశాయ్ తుపాకులతో రోడ్డుపై కనిపించిన వ్యక్తులు, కార్లు, పోలీసుల మీద కాల్పులు జరిపాడని, సుమారు 20 నిమిషాల పాటు రెచ్చిపోయాడని అక్కడి మీడియా తెలిపింది. సదరు వ్యక్తి ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న అంశంపై కారణాలు తెలియరాలేదు. ఘటనలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాల్పులు జరిపిన లాయరుకి అతడి న్యాయసంస్థలో కొన్ని సమస్యలు వున్నాయని తెలుస్తోంది. నాథన్ దేశాయ్ తండ్రి ప్రకాష్ దేశాయ్ ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ... తన కుమారుడి న్యాయవాద ప్రాక్టీసు అంతంత మాత్రంగానే ఉండడంతో కుంగిపోయేవాడని పేర్కొన్నాడు. తన కుమారుడు చేసిన చర్యను తాను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. కాల్పుల ఘటనకు 12 గంటల ముందే తన కొడుకుతో కలిసి తాను భోజనం చేసినట్లు పేర్కొన్నాడు.