: భారత్ దెబ్బకు ఆగిపోనున్న సార్క్ సమావేశాలు!
పక్కలో బల్లెంలా నిలిచి, భారత గడ్డపై ఉగ్రవాద దాడులు చేయిస్తున్న పాకిస్థాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి మరింతగా పెరిగింది. పాక్ ను ఏకాకిని చేయాలని ఇండియా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పెరుగుతోంది. నవంబరులో పాకిస్థాన్ లో జరగాల్సిన సార్క్ సమావేశాలకు హాజరు కాబోమని భారత్ తేల్చి చెప్పిన వేళ, ఇతర సభ్యదేశాలు బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్గనిస్థాన్ లు ఇండియాకు బాసటగా నిలిచాయి. తాము కూడా సార్క్ సమ్మిట్ కు హాజరు కాబోవడం లేదని తేల్చి చెప్పాయి. ఇక సార్క్ అధ్యక్ష పదవిని అనుభవిస్తున్న నేపాల్ ఈ సమావేశాలకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితుల్లో ఉండగా, శ్రీలంక తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో సార్క్ సమావేశాలు వాయిదా పడే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పఠాన్ కోట్, యూరీ ఉగ్రదాడులకు నిరసనగా సార్క్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు భారత్ మంగళవారం నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే.