: మీ టెలీకాన్ఫరెన్సులకు ఓ దండం 'బాబూ'!.. సోమవారం వస్తే బెంబేలెత్తుతున్న ఉద్యోగులు!


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతివారం నిర్వహించే టెలీకాన్ఫరెన్సులతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఆయన టెలీకాన్ఫరెన్సుల్లో కొత్తదనం లేకపోవడం, చెప్పిందే చెప్పడం, పనికొచ్చే సూచన ఒక్కటీ లేకపోవడంతో సీఎం కాన్ఫరెన్సులు బోరు కొట్టిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక సోమవారం వస్తోందంటే చాలు వ్యవసాయశాఖ అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఆ రోజు బాబు నిర్వహించే కాన్ఫరెన్స్‌లో గంటసేపు మాట్లాడతారు. ఇవికాస్తా మితిమీరడంతో అసలు ప్రయోజనాలు పక్కకుపోయి మొక్కుబడిగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం తీరుతో అధికారులు, నేతలు కూడా వాటిని అంతగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నిజానికి సమయం, డబ్బు వృథాని నివారించడమే టెలీకాన్ఫరెన్సుల ముఖ్య ఉద్దేశం. కానీ సీఎం చంద్రబాబు నిర్వహించే టెలీకాన్ఫరెన్సులతో ఏ వృథాను అయితే తగ్గించాలని అనుకుంటున్నారో అదే వృథా అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాన్ఫరెన్సులో చంద్రబాబు దాదాపు గంటకుపైగా మాట్లాడతారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు అసలు విషయంపై చర్చ జరుగుతుంది. దీనివల్ల అసలు లక్ష్యం పక్కకుపోతోందని అంటున్నారు. కాన్ఫరెన్సులో పాల్గొనే అధికారులు సైతం అర్థవంతమైన అంశాలు లేవనెత్తడానికి బదులు సీఎంను స్తుతించడానికే తమ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో పదేపదే పాతవిషయాలను ప్రస్తావిస్తుండడంతో వినేవారికి విసుగు తెప్పిస్తోంది. మరోవైపు వారానికి రెండుమూడు టెలీకాన్ఫరెన్సులతో అధికారులు అలసిపోతున్నారు. అంతేకాదు, మిగతా పనులను వాయిదా వేసుకుని మరీ వీటికి హాజరుకావాల్సి వస్తోందని చెబుతున్నారు. చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు అంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టెలీ కాన్ఫరెన్సు విధానం మంచిదే అయినా సమయం వృథాకు దారితీస్తోందని, దీనికి కారణాలపై అధ్యయనం చేయాల్సి ఉందని ఓ మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News