: సందీప్ పాటిల్ పై అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ వ్యవహారశైలిపై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి వైదొలగిన అనంతరం సందీప్ పాటిల్ సచిన్, ధోనీపై చేసిన వ్యాఖ్యలు పదవిలో ఉండగా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు. అంతేకాదు, పదవీ కాలంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఆలోచనలపై పదవి నుంచి దిగిపోయిన తరువాత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇకపై భవిష్యత్ లో సందీప్ పాటిల్ కు బాధ్యతలు అప్పగించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోందని ఆయన అన్నారు. కాగా, సచిన్ ఎవరికీ చెప్పకుండా రిటైర్ అయ్యాడని, అలా అవ్వకుంటే ఆయనను జట్టు నుంచి తొలగించి ఉండేవారని, ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని పలు సందర్భాల్లో చర్చించామని సందీప్ ఇటీవల కామెంట్ చేశాడు. దీంతో ఆయనపై అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.