: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: తోటి విద్యార్థినులకు సూచించిన పీవీ సింధు
హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో పీవీ సింధుకు ఆ కాలేజీ యాజమాన్యం ఈరోజు సన్మానం చేసింది. సింధు అదే కళాశాలలో ప్రస్తుతం ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సింధుకి కళాశాల యాజమాన్యం జ్ఞాపికను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ... చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తన తోటి కళాశాల విద్యార్థులకు సూచించింది. తన కళాశాల యజమాన్యం, విద్యార్థులు తనకు అభినందనలు తెలుపుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది. కఠిన శ్రమ ద్వారానే విజయాలు సాధించగలమని వ్యాఖ్యానించింది. తనకు కళాశాల విద్యార్థులు, యాజమాన్యం మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.