: వార్ గేమ్స్ షురూ... పాక్ కు వైమానిక సత్తా రుచి చూపాలని వాయుసేన నిర్ణయం!
భారత వైమానిక సత్తా ఏంటన్నది పాకిస్థాన్ కు కాస్తంత రుచి చూపాలని వాయుసేన నిర్ణయించింది. శ్రీనగర్ నుంచి రాజస్థాన్ లోని బికనీర్ వరకూ సరిహద్దుల్లో భారీ ఎత్తున విన్యాసాలు చేయాలని నిర్ణయించింది. భారత వాయుసేన ప్రధాన కమాండ్ సహా, పశ్చిమాన ఉన్న 18 ఎయిర్ బేస్ లతో పాటు పూర్తి స్థాయి యుద్ధ విమానాలు, చాపర్లతో ఈ విన్యాసాలు ఉంటాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్ తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని భావించిందని, అందుకోసం సరిహద్దుల్లో 'ఎక్సర్ సైజ్ తాలోన్' పేరిట నాలుగు రోజుల పాటు వార్ గేమ్స్ ఆడనుందని ఓ అధికారి వివరించారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని, గతంలోనూ ఇదే తరహా విన్యాసాలు తాము చేశామని తెలిపారు. యూరీ ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగిన నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితినైనా పూర్తి సన్నద్ధతతో ఎదుర్కొనే చర్యల్లో భాగంగానే మన విమానాలు, చాపర్ల సత్తా ఏంటో పరీక్షించేందుకు ఈ విన్యాసాలు జరుగుతాయని, వీటిని చూసేందుకు కేంద్ర మంత్రులు రానున్నారని వివరించారు. కాగా, ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్బీ డియో, ఇప్పటికే జైపూర్, చాందీమందిర్, ఉధంపూర్ తదితర ఎయిర్ బేస్ స్టేషన్లలో పర్యటించారు. ప్రతి కమాండర్ పిలవగానే స్పందించేంత దూరంలోనే ఉండాలని ఆదేశించారు. శ్రీనగర్, లేహ్, థాయ్సీ, అవంతిపూర్, అంబాలా, అమృతసర్, హల్వారా, నాల్ ప్రాంతాల్లోని ఎయిర్ బేస్ లు, అక్కడి విమానాలు, హెలికాప్టర్లు ఈ డ్రిల్ లో పాల్గొననున్నాయి. కాగా, భారత విన్యాసాలన్నీ సరిహద్దుల్లోనే జరగనుండటంతో, వీటిని పాక్ సైన్యాధికారులు నిశితంగా పరిశీలించనున్నారని తెలుస్తోంది.