: ఎవరినీ ఉపేక్షించవద్దు.. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారందరినీ శిక్షించాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
హైదరాబాద్ నగరంలో పడిన వర్షానికి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో తెలంగాణ సర్కారు విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నాలాలపై అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందుకు కారణమైన రాజకీయ నాయకులతో పాటు ఎవరినీ ఉపేక్షించవద్దని అన్నారు. కష్టాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సర్కారు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.