: మంచి దొంగలు.. డబ్బులు ఇవ్వమని కొట్టి, ఆ తరువాత గాయానికి కట్టుకట్టారు!


దొంగలు డ‌బ్బు, న‌గ‌లు దోచుకోవ‌డ‌మే కాకుండా ప్రాణాలు సైతం తీసేందుకూ వెనుకాడరు. కానీ, కొందరు తాము చేసిన పొర‌పాట్ల‌పై ప‌శ్చాత్తాప‌ ప‌డుతుంటారు. కాస్తో కూస్తో మంచివారు అని అనిపించుకుంటారు. అటువంటి సంఘ‌ట‌నే పశ్చిమ బెంగాల్‌లో జ‌రిగింది. సంజిత్‌ సింగ్ అనే వ్య‌క్తి ఇంట్లోకి తాజాగా ఆరుగురు దొంగలు ప్ర‌వేశించారు. ఇంటి య‌జ‌మాని బ్యాంకు నుంచి లోను తెచ్చుకున్నాడన్న స‌మాచారం తెలుసుకున్న దొంగ‌లు సంజిత్‌ సింగ్ ను బెదిరించారు. బ్యాంక్‌ నుంచి అప్పుగా తెచ్చుకున్న‌ రూ.6 లక్షలు త‌మ‌కు ఇచ్చేయ‌మంటూ బెదిరించారు. అయితే, సంజిత్‌ సింగ్ తాను బ్యాంకు నుంచి రూ.6 లక్షలు రుణం తీసుకోలేదని చెప్పాడు. తాను రూ.60వేలు మాత్రమే రుణానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌ని పేర్కొన్నాడు. అయితే ఆయ‌న మాట‌లు న‌మ్మ‌ని దొంగలు సంజిత్‌ భార్య, పిల్లల్ని కట్టేశారు. డ‌బ్బు ఇవ్వ‌మంటూ సంజిత్‌ తలపై గొడ్డలితో కొట్టారు. అనంత‌రం దొంగ‌లు డబ్బు కోసం ఇంట్లో వెతికారు. వారికి బ్యాంక్‌ పత్రాలు దొరికాయి. అందులో సంజిత్‌ రూ.60వేల రుణం కోసం పెట్టిన దరఖాస్తు ల‌భించింది. అంతేగాక‌, అందులో బ్యాంక్‌ అతనికి రూ.10వేలు ఇచ్చిన‌ట్లు రిసీట్ కూడా ల‌భించింది. సంజిత్‌ సింగ్ తమతో చెప్పింది నిజమేనని గ్రహించిన దొంగలు, త‌మ త‌ప్పు తెలుసుకొని తాము తీవ్రంగా గాయపర్చిన‌ సంజిత్‌ సింగ్ కు బయటి నుంచి కలబంద ఆకులు తెచ్చి తలకు కట్టుకట్టి సేవ‌చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆ దొంగలు వారి నుంచి రూ.10వేల రూపాయ‌లు, కొంత‌ బంగారం ఎత్తుకెళ్లారు. ఈ విష‌యాన్నంతా సంజిత్‌ సింగ్ తాను పోలీసుల‌కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News