: టీడీపీ ఎమ్మెల్యే రూ.5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు: ‘మాంటెకార్లో’ సెక్రటరీ


రాపూరు-కృష్ణపట్నం రైల్వే పనులకు సంబంధించి తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ డిమాండ్ చేస్తున్నాడని మాంటెకార్లో కంపెనీ సెక్రటరీ కల్పేశ్ దేశాయ్ ఆరోపించారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, పనులకు ఆటంకం కలిగిస్తూ తరచుగా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని అన్నారు. రూ.5 కోట్లు ఇవ్వలేమని చెప్పినా ఎమ్మెల్యే వినిపించుకోవడం లేదని, తన డిమాండ్ నెరవేర్చకుండా పనులు చేయలేరని ఆయన బెదిరిస్తున్నారని ఆరోపించారు. నిర్ణీత గడువులోగా పనులు చేయకుంటే, తాము రైల్వేశాఖకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఆయన వాపోయారు. 12.5 శాతం లెస్ కు తాము కాంట్రాక్టు పొందామని, ఎమ్మెల్యే బెదిరింపుల కారణంగా కొంతకాలంగా పనులు ఆగిపోయాయని అన్నారు. అవసరమైతే తాను సీఎం దగ్గరకు వెళతానని ఎమ్మెల్యే అంటున్నారని, అప్పటివరకు ఈ పనులు ఆపాల్సిందేనని ఆయన బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కల్పేశ్ దేశాయ్ కోరారు.

  • Loading...

More Telugu News