: రక్తం, నీళ్లు కలిసి ప్రవహించకూడదు!: ‘సింధు’ జలాల ఒప్పందంపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు


‘రక్తం, నీళ్లు కలిసి ప్రవహించకూడదు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ కు పాకిస్థాన్ తో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోకూడదని, గతంలో కంటే ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించాలని అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సింధు నది ఒప్పందాన్ని ప్రధాని మోదీ ఈరోజు పున:సమీక్షించారు. ఈ ఒప్పందంలోని సానుకూల, ప్రతికూల అంశాలపై ఆయన చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి విదేశాంగ కార్యదర్శి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఒప్పందంలోని వివరాలు, దానిని రద్దు చేసుకోవాలంటే వచ్చే చిక్కులు, సానుకూల, ప్రతికూల అంశాలను మోదీకి వివరించినట్లు నీటి వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా పశ్చిమ నదుల ద్వారా న్యాయపరంగా భారత్ కు లభించిన 18 వేల మెగా వాట్ల విద్యుదుత్పత్తిని పూర్తిగా వినియోగించుకోవాలని కూడా నిర్ణయించారు. భారత్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ముగింపు పలకనంత వరకు ఇండస్ వాటర్ కమిషన్ చర్చలు జరపకూడదని ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 1987లో చేపట్టిన తుల్ బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని, దానిని మరోసారి సమీక్షించాలని, చీనాబ్ నదిపై చేపడుతున్న పాకుల్ దుల్, సావల్ కోట్, బుర్సార్ డ్యామ్ ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని ప్రధాని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News