: వాళ్లు పిలుస్తారు...మీరు మాత్రం స్పందించకండి: గ్రహాంతరవాసులపై ప్రఖ్యాత స్టీఫెన్ హాకింగ్స్ హెచ్చరిక
భూమిపై కాస్తో కూస్తో చదువుకుని ఉన్న ప్రతిఒక్కరూ ఆసక్తి చూపే అంశం ఏదైనా ఉందంటే అది గ్రహాంతరవాసులకు చెందినదేననడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు. అందుకే శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మనలాంటి వారెవరైనా ఉన్నారా? ఉంటే వారెవరు? వారి శక్తి సామర్థ్యాలేంటి? తదితర అంశాలపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దీనిపై శాస్త్రవేత్తలకు ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ ఓ వార్నింగ్ ఇచ్చారు. ‘స్టీఫెన్ హాకింగ్స్ ఫేవరెట్ ప్లేసస్’ అనే డాక్యుమెంటరీ ద్వారా ఆయన శాస్త్రవేత్తలకు ఈ సూచన చేశారు. భూమికి 16 కాంతి సంవత్సరాల దూరంలో వున్న ఒక గ్రహం నుంచి ఎప్పటికయినా సిగ్నల్స్ రావచ్చని ఆయన అన్నారు. అయితే వారు పంపిన సిగ్నల్స్ కి మనం తిరిగి స్పందించకూడదని ఆయన సూచించారు. వారితో కలయిక మనకు నష్టాన్ని కలిగించవచ్చని ఆయన అంచనా వేశారు. క్రిస్టఫర్ కొలంబస్ రాకకు పూర్వం అమెరికా అపూర్వమైన నాగరికత కలిగివున్న దేశమన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆయన కనుగొన్న తరువాత అక్కడికి వివిధ దేశాల ప్రజలు వలస వెళ్లడం, ఇప్పుడు వివిధ రంగాల్లో అలా వచ్చి స్థిరపడినవారే నేటివ్ అమెరికన్లను మించిన స్థాయిలో ఉండి, అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రహాంతర జీవులు అన్ని రకాలుగా మనకన్నా అభివృద్ధి చెందివుంటాయని తెలిపిన ఆయన, వారితో సాన్నిహిత్యం భూగ్రహంలో వారి వలసపాలనకు దారి తీస్తుందని అంచనా వేశారు. కొన్నేళ్ల క్రితం ‘బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్టు’ను ప్రారంభించిన హాకింగ్స్ కనీసం ఒక మిలియన్ నక్షత్రాలను శోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశోదనల్లో భాగంగా ఆయన కొన్ని కొత్త విషయాలు కనుగొన్నారు.