: పల్నాడు ప్రాంతంలో జగన్ కు ఘనస్వాగతం, రైతును కారులో కూర్చోబెట్టుకుని మాట్లాడిన జగన్
భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పల్నాడు ప్రాంతం రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ జగన్ పర్యటన ప్రారంభమైంది. ఈ ఉదయం దాచేపల్లికి వచ్చిన ఆయనకు రైతులు, వైకాపా అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఆయన కాన్వాయ్ అత్యంత నిదానంగా సాగుతుండగా, తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు నవ్వుతూ అభివాదం చేస్తూ, జగన్ సాగుతున్నారు. దాచేపల్లి దాటిన తరువాత ముత్యాలంపాడు వరకూ 7 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా జగన్ వెళతారని, దారిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. ఆపై తిరిగి దాచేపల్లికి వచ్చి కాటేరు వాగును ఆయన పరిశీలిస్తారని, తదుపరి గురజాల సమీప ప్రాంతాలైన జంగమేశ్వరపురం, చర్ల గుడిపాడు గ్రామాలను సందర్శిస్తారని తెలిపారు. కాగా, దాచేపల్లిలో తనను పలకరించేందుకు వచ్చిన ఓ రైతును, జగన్ తన వాహనంలోకి ఆహ్వానించి, వర్షాలు పడ్డ తీరును అడిగి తెలుసుకున్నారు. ఏ మేరకు నష్టం వాటిల్లింది? పెట్టుబడి ఎంత పెట్టారు? బ్యాంకుల రుణాల పరిస్థితి ఏంటి? తిరిగి పంటను వేసుకునే వీలుందా? వంటి ప్రశ్నలు అడిగారు. మరో చోట వాహనం దిగి రైతుల వద్దకు వెళ్లి, అండగా ఉంటానని హామీ ఇచ్చారు.