: విజయం డొనాల్డ్ ట్రంప్ దే... 30 ఏళ్ల నుంచి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సరిగ్గా చెబుతున్న ప్రొఫెసర్ జోస్యం
నవంబర్ 8... ఈ తేదీ గురించి యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకో తెలుసుగా? అమెరికా అధ్యక్షుడిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లలో ఒకరిని అమెరికన్లు ఎన్నుకునే రోజది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం ఎవరికీ తెలియదు. కానీ, యూఎస్ ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ ప్రొఫెసర్ 1984 నుంచి అమెరికన్ అధ్యక్ష ఎన్నికలపై తనదైన సర్వే ఫలితాలను వెల్లడించగా, అన్ని ఫలితాలూ నిజమయ్యాయి. హిల్లరీ క్లింటన్ తో పోలిస్తే, ట్రంప్ తన అభ్యర్థిత్వానికి గట్టి పోటీ లేకుండానే బరిలోకి దిగడం, ప్రతినిధుల సభ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ మరిన్ని సీట్లు గెలవడం, ట్రంప్ దూకుడు, అమెరికన్ ప్రజల్లో ఉగ్రవాదం పట్ల పెరుగుతున్న భయం, వలసవాదుల నుంచి వస్తున్న ప్రమాదాలు... తదితరాలు ప్రజలు ఆయన్ను ఎంచుకునేందుకు సహకరిస్తున్నాయని తెలిపారు. అమెరికన్ యూనివర్శిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా ఉన్న లిచ్ మ్యాన్, తాను ఈ అంచనాకు రావడానికి ఎంతో శ్రమించానని, తన జీవితంలో ఓ ఎన్నికకు ముందు ఇంతగా కష్టపడింది లేదని చెప్పుకొచ్చారు.