: బాలుడిని పొట్టనపెట్టుకున్న క్రికెట్ గొడవ
పిల్లలు సరదాగా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ ఓ బాలుడి మరణానికి కారణమైంది. శ్రీలంకలోని మటుగామలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ సందర్భంగా తలెత్తిన చిన్న వివాదమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం.. బాలలు రెండు జట్లుగా విడిపోయి మ్యాచ్ పెట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టులోని ఓ బాలుడు(16) బౌలింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను వేసిన బాల్‌ను వైడ్ అంటూ బ్యాట్స్‌మన్ ఆరోపించాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం పట్టలేని బ్యాట్స్‌మన్ స్టంప్‌తో బాలుడిపై దాడి చేశాడు. అతడికి జట్టులోని మరో ఐదుగురు జతకలిశారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.