: ‘యూ ట్యూబ్’లో చిత్రాలకు హిట్లు, ప్లాప్ లనేవి ఉండవు: సినీ నటుడు ఎల్బీ శ్రీరామ్


‘యూట్యూబ్’లో చిత్రాలకు హిట్స్, ప్లాప్స్ అనే తేడా ఉండదని ప్రముఖ సినీ నటుడు ఎల్బీ శ్రీరామ్ అన్నారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘యూట్యూబ్’లో చిత్రాలను ఒక రోజు వంద మంది చూస్తే, మరో రోజు వెయ్యిమంది చూడొచ్చని, వాటికి కాలదోషం పట్టదని అన్నారు. అందుకనే, తాను తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘యూట్యూబ్’లో ఎప్పటికీ సంచరిస్తూనే ఉంటాయని అన్నారు. రంగ స్థలంతో తన కెరీర్ ను ప్రారంభించానని, ఆ తర్వాత రేడియో నాటికలతో ముందుకు వెళ్లానని చెప్పారు. అనంతరం, సినీ పరిశ్రమలోకి రావడం రచయితగా, నటుడిగా కొనసాగడం జరిగిందన్నారు. అయితే, సినిమాల్లో నటిస్తున్నా తనకు తెలియని అసంతృప్తి ఉండేదని అన్నారు. సినిమాల్లో ఏ సన్నివేశం ఎప్పుడు తీస్తారో తెలీదని, ముందు కామెడీ సీన్ చేసి, ఆ తర్వాత ప్రేక్షకులను కన్నీరు పెట్టించే సన్నివేశం చేస్తారని అన్నారు. ఆ విధంగా నటించడం వల్ల కథలోని భావోద్వేగానికి దూరమవుతున్నానని అనిపించేందని అన్నారు. అయితే, నాటకాల్లో అలా ఉండదన్నారు. మళ్లీ నాటకాలాడాలని ఉన్నప్పటికీ వాటి ఆదరణ కాస్త తగ్గిందన్నారు. నాటకాభిమానుల కోసం నాటకాలు వేయాలనుకున్నప్పటికీ, సినిమాల వల్ల సమయం కేటాయించలేనేమో అనిపించిందన్నారు. నాటకాలకు ప్రత్యామ్నాయంగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించాలనిపించిందన్నారు. అయితే, సినిమాల్లో చేసి షార్ట్ ఫిల్మ్స్ లో చేస్తే ఆదరణ తగ్గుతుందన్న మాటలను పక్కనబెట్టి ‘రాళ్లు’ అనే ఒక లఘుచిత్రాన్ని నిర్మించానని చెప్పారు. అంతర్జాతీయ చిత్రోత్సవంలో రాళ్లు ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుందని నాటి విషయాలను ఆయన ప్రస్తావించారు. తాను నేర్చుకున్న, తనకు తెలిసిన మంచి విషయాలను నలుగురితో పంచుకోవాలన్న తపనతోనే షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలుపెట్టానని, అందరి మనసులకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు ఏడు లఘు చిత్రాలను తీశానని తనదైన మాటతీరుతో ప్రేక్షకులను నవ్వించే ఎల్బీ శ్రీరామ్ చెప్పారు.

  • Loading...

More Telugu News