: 'వరద సాయం అందలేదు' అని ఎవరైనా అంటే కఠిన చర్యలే: హెచ్చరించిన చంద్రబాబు


భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజలకు తక్షణ వరద సాయం అందిస్తున్నామని, వీటి పంపిణీలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపినా కఠిన చర్యలు తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ ఉదయం విజయవాడలో వర్షాలు, వరదలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎమ్మెల్యేలు, సర్పంచ్ లు, జడ్పీటీసీ సభ్యులు, అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్న ఆయన, నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. కూలిన విద్యుత్ స్తంభాలను రెండు రోజుల్లో నిలబెట్టాలని, 3 రోజుల వ్యవధిలో ఆర్అండ్ బీ రహదారుల తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువులకు పడిన గండ్లను మూడు రోజుల్లో పూడ్చాలని, ప్రజలందరికీ రెండు రోజుల్లో తాగునీటిని పునరుద్ధరించాలని అధికారులకు చెప్పారు. వరదసాయం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయ, పునరావాస చర్యల్లో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News