: సాధ్యమైనంత ఆధిక్యమే భారత్ వ్యూహం... నాలుగో రోజు ఆట మొదలు
న్యూజిలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న మొదటి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి తన రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసిన భారత జట్టు, 215 పరుగుల లీడ్ తో నాలుగో రోజు ఆటను మొదలు పెట్టింది. నేడు సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచడమే భారత్ లక్ష్యం. కాగా, వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్ లో రాణిస్తే, మొదటి టెస్టును దక్కించుకునే అవకాశాలు తమకూ ఉంటాయని న్యూజిలాండ్ భావిస్తోంది. ప్రస్తుతం భారత స్కోరు 48 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు కాగా, మురళీ విజయ్ 64, పుజారా 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.