: కడప జిల్లాలో వజ్రాల నిక్షేపాలు.. పెన్నానదిలో వజ్రాల గనులపై సర్వే
కడప జిల్లాలోని పెన్నానది పరివాహక ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలపై సర్వే చేయనున్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ మందపల్లి రాజు తెలిపారు. గతేడాది ఈ ప్రాంతంలో రెండు 0.5 కేరెట్ల వజ్రాలు దొరికాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వజ్రాల గనులపై సర్వే చేసి పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. 165 ఏళ్ల సంస్థ చరిత్రలో తొలిసారి సంస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాజు విశాఖపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో రెండు ఇనుప గనులను గుర్తించామని, స్వయంగా సంస్థే గనుల తవ్వకాలు చేపడుతుందని తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి కళింగపట్నం వరకు మొత్తం 225 చదరపు కిలోమీటర్ల మేర ఇలమనైట్, గార్నెట్, సిల్వనైట్ తదితర ఆరు రకాల నిక్షేపాలు 35 మిలియన్ టన్నుల వరకు ఉన్నట్టు వివరించారు. వీటికి త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి పూడిమడక వరకు తీరంలో లైమ్ మడ్ నిక్షేపాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా బంగాళాఖాతంలో కూలిపోయిన ఏఎన్-32 విమాన శకలాల అన్వేషణలో తమ సంస్థకు చెందిన సముద్ర రత్నాకర నౌక పాల్గొందని, 18 ప్రాంతాల్లో కొన్ని అవశేషాలను గుర్తించామని రాజు వివరించారు.