: ఈ వర్షాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు...అక్రమ కట్టడాలను మాత్రం కూల్చేస్తాం!: ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో వర్షాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో కేవలం 10 శాతం రోడ్లు మాత్రమే దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. రోడ్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపడతామని ఆయన తెలిపారు. మీడియా చెబుతున్నంత భయంకరమైన పరిస్థితి హైదరాబాదులో లేదని ఆయన అన్నారు. మరో రెండేళ్ల వరకు వ్యవసాయానికి ఢోకా లేదని ఆయన చెప్పారు. పల్లెల్లో 56 శాతం రోడ్లు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్యటీములను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సహాయకచర్యలు చేబట్టడానికి ఆర్మీ, విపత్తు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే హెలికాప్టర్లతో సహాయకచర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. హైదరాబాదులో అక్రమ కట్టడాలపై సరైన ఫిర్యాదు చేసినవారికి 10,000 రూపాయల నజరానా ఇస్తామని ఆయన ప్రకటించారు. వరదలపై తెలంగాణ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.