: దేవుడు కనిపించి చెప్పాడంటూ ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు!


దేవుడు చెప్పాడని ఓ వ్యక్తి సొంత ఇంటినే తగులబెట్టుకున్న ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఆర్కాన్సాస్ పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... ఈనెల 5న బాక్ట్సెర్ కౌంటీకి చెందిన స్కాట్ జి.విల్లెట్ (25) ఇంటి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో కష్టపడి మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, దీనిని తగులబెట్టేసింది ఆ ఇంటి యజమానేనని నిర్ధారించారు. ఈ విషయమై స్కాట్ ను విచారించగా, తనకేమీ తెలియదని, తాను బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి చుట్టూ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు గుమిగూడి ఉన్నారని స్కాట్ అబద్ధం చెప్పాడు. దీంతో తాము సేకరించిన సీసీ టీవీ పుటేజ్ ను అతనికి చూపించి...'ఇప్పుడు చెప్పు... ఏం జరిగిందో?' అంటూ నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పాడు. దేవుడు కనిపించి ఇంటిని తగులబెట్టేయమని చెప్పడంతో ఆ పని చేశానని అన్నాడు. బెడ్ రూంలో మంట పెట్టి బయటకు వెళ్లిపోయానని, తరువాత తాను వచ్చి చూసేసరికి అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతూ కనిపించారని చెప్పాడు. అతను చెప్పింది విన్న పోలీసులు విస్తుపోయారు. తర్వాత అతనిని అదుపులోకి తీసుకుని లియూలోని బాక్ట్సెర్ కౌంటీ జైలుకు తరలించారు. అతను ఇప్పుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News