: ధోనీ కంటే కర్మయోగిని మనం చూస్తామా?: రాజమౌళి


ధోనీ గొప్ప కర్మయోగి అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొనియాడాడు. హైదరాబాదులో 'ఎం.ఎస్.ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, వరల్డ్ కప్ ను సాధించిన అనంతరం 130 కోట్ల మంది భారతీయులు సంబరాలు చేసుకుంటుంటే... ధోనీ మాత్రం కప్ ను అందుకుని దానిని సహచరులకు అందించి, తను మాత్రం పక్కకు వెళ్లి నిలబడ్డాడని అన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ సమయంలో తన భావోద్వేగాలను అణచుకోలేకపోయారని, ధోనీ మాత్రం తనకేమీ పట్టనట్టు పక్కన నిలబడ్డాడని, అంత స్థితప్రజ్ఞత అతనికి ఎలా వచ్చిందా? అని తాను ఆశ్చర్యపోయానని రాజమౌళి తెలిపారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీని అనుకరించలేదని, ధోనీ పాత్రలో పరకాయప్రవేశం చేశాడని అన్నారు. ఒక నటుడు ఇంకో వ్యక్తి పాత్రలో ప్రవేశించి నటించడం ఎంత కష్టమో దర్శకుడిగా తనకు తెలుసని ఆయన చెప్పారు. సుశాంత్ సింగ్ చాలా బాగా నటించాడని, ఈ చిత్రాన్ని తొలిరోజు తొలి ఆటను చూడాలనుకుంటున్నానని రాజమౌళి తెలిపారు. అనంతరం ధోనీతో ఓ ఫోటో దిగాలని ఉందని చెప్పి, ధోనీతో ఆయన ఫోటో దిగడంతో, రాజమౌళి నమ్రతకు అంతా క్లాప్స్ కొట్టి అభినందించారు.

  • Loading...

More Telugu News