: వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, టీడీపీ నేతలు ఇతర పార్టీల నేతలను చేర్చుకునే పనిలో ఉన్నారు: బొత్స ఆరోపణ
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వరద ప్రభావిత ప్రాంతమైన గుంటూరులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళ వారాల్లో పర్యటిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టడంలో ఏపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. ఓ వైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే, మరోవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకునే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నేతలు దోమలపై దండయాత్ర అంటూ మాట్లాడుతున్నారని, మొదట వరదలతో కష్టాల్లో ఉన్న వారిని పట్టించుకోవాలని ఆయన సూచించారు. తక్షణమే యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆయన అన్నారు.