: పాక్ కు బదులెలా ఇద్దాం?: త్రివిధ దళాధిపతులతో మోదీ కీలక భేటీ
యూరీపై ఉగ్రదాడి జరిగిన తరువాత, పాకిస్థాన్ కు దీటైన బదులిచ్చే మార్గాలు చెప్పాలని త్రివిధ దళాధిపతులను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ ఉదయం ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహ, నౌకదళం ఉప అధిపతి వైస్ అడ్మిరల్ కేబీ సింగ్ లతో ప్రత్యేకంగా సమావేశమైన ప్రధాని, వారందరి సలహాలనూ అడిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా హాజరయ్యారు. సైనిక స్థావరంపై ఉగ్రదాడి తరువాత ప్రధాని పలుమార్లు ఉన్నతాధికారులతో, కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, నౌకాదళం చీఫ్ సునీల్ లాంబా అందుబాటులో లేకపోయినందున కేబీ సింగ్ ఈ సమావేశానికి వచ్చారని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి మరింత సమాచారం వెలువడాల్సివుంది.