: శ్రీశైలానికి తిరిగి జలకళ... లక్ష క్యూసెక్కులు దాటిన వరద
మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద కృష్ణా నదిలోకి వచ్చి చేరుతోంది. ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టులకు వస్తున్న వరదనీటిని వస్తున్నది వస్తున్నట్టు వదిలివేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 1.27 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.460 మీటర్ల వరకూ నీరుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,11,400 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 2,200 క్యూసెక్కులను మాత్రమే దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, 876.20 అడుగుల వరకూ నీరుంది. నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండటం, మరింత వరద వచ్చి చేరే అవకాశాలు కనిపిస్తుండటంతో, మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయం ఈ సీజన్ లో తొలిసారిగా నిండుతుందని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణా పుష్కరాల వేళ శ్రీశైలంలో 875 అడుగుల నీటి మట్టాన్ని మాత్రమే కొనసాగించి, వచ్చిన నీటిని వచ్చినట్టు నాగార్జున సాగర్ కు వదిలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం డ్యామ్ లో పూర్తి నీటిమట్టం వచ్చాకే సాగర్ కు నీరివ్వాలన్నది అధికారుల నిర్ణయం.