: బీ కేర్‌ఫుల్.. వరదల నేపథ్యంలో మంత్రులు, అధికారులకు కేసీఆర్ ఆదేశం


ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదల నేపథ్యంలో మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని, రాత్రింబవళ్లు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డి, జెన్‌కో జీఎండీ ప్రభాకర్‌రావు తదితరులతో మాట్లాడిన కేసీఆర్ నగరంలో పరిస్థితిని సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే రంగంలోకి దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉన్నట్టు సీఎం పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండుతుండడంతో ప్రవాహ ఉద్ధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని మంత్రి హరీష్‌రావును సీఎం ఆదేశించారు. చెరువు కట్టలు తెగినా, బుంగపడినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఆదేశంతో ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణకు హరీష్ రావు అధికారులను నియమించారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేసి తగిన ఆదేశాలు ఇచ్చేందుకు జలసౌధలో 040-23390794 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడం బాధాకరమని పేర్కొన్న సీఎం కేసీఆర్ వరద నష్టాన్ని అంచనా వేయాలని సీఎస్ రాజీవ్‌శర్మను ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, పలు పంటలు కూడా దెబ్బతిన్నట్టు ముఖ్యమంత్రి వివరించారు.

  • Loading...

More Telugu News