: పేదల గృహసముదాయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. తిండి లేకపోయినా ఫర్వాలేదు, ఈ ఇంట్లో బతికిపోతామని అన్నారని వ్యాఖ్య
విశాఖపట్నంలోని పరవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన జేఎన్ఎన్‌యూఆర్ఎం పేదల గృహసముదాయాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 1839 మంది పేదలకు అపార్ట్‌మెంట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అందులో అన్ని సదుపాయాలను కల్పించామని చెప్పారు. మంచివి కట్టాలన్న ఉద్దేశంతో డబ్బుకి వెనకాడకుండా ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రూ.15 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్‌బిల్డింగ్, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. మరికొన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పారు. వీధి దీపాల పని 75 శాతం పూర్తయిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు అపార్ట్‌మెంట్లు కొనుక్కొని అన్ని సదుపాయాలు ఉండాలని కోరుకుంటారని, అటువంటి సదుపాయాలే అక్కడ కల్పించినట్లు తెలిపారు. తిండి లేకపోయినా ఫర్వాలేదు, ఈ ఇంట్లో బతికి పోతామని ఓ లబ్ధిదారుడు తనతో అన్నాడని ఆయన గుర్తు చేసుకున్నారు. పేదవారందరూ ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. తాము చేస్తోన్న పనులతో పేదల మన్ననలు పొందుతున్నామని ఆయన అన్నారు. ఆనాడు తాను పాదయాత్ర చేస్తూ అందర్నీ ఆదుకుంటామని, వారి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పినట్లు ఆయన తెలిపారు. తానిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులకు ఇచ్చే పింఛన్‌ను రూ.1000కి పెంచినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్యుత్ కొరత లేకుండా చేసిందని అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ గ్యాస్ అందేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ వంటగ్యాస్ ఇప్పించే బాధ్యతను తాను తీసుకున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జలసిరి కింద రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఏడాదిలో 71 వేల ఇళ్లు నిర్మించాలన్న బాధ్యతను తాము తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఇంటికీ ఫైబర్ గ్రిడ్ ద్వారా టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్ అందించనున్నట్లు తెలిపారు.