: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం వల్ల ఏపీకి నష్టం ఏటా రూ.150 కోట్లు: మంత్రి యనమల
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన నిన్నటి నుంచి కొనసాగుతున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ తొలి సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీకి ఏటా రూ.150 కోట్ల నష్ణం వస్తుందని చెప్పారు. చిరువ్యాపారులకు నష్టం రాకూడదనే తాము కౌన్సిల్ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. మొదట రూ.10 లక్షల టర్నోవర్ పైబడిన వారికి జీఎస్టీ వర్తింపజేయాలని అనుకున్నప్పటికీ, అందరి అభిప్రాయాలు విన్న తరువాత దీనిని రూ.20 లక్షలుగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.