: నా రిటైర్మెంట్ గురించి పీసీబీ తొందరపడాల్సిన అవసరం లేదు: పాక్ క్రికెటర్ సయీద్ అజ్మల్


ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఉద్దేశం తనకు లేదని, ఈ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొందరపడాల్సిన అవసరం లేదని పాక్ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ చెప్పాడు. తమ దేశంలోని పలువురు క్రికెటర్లకు ఘనమైన వీడ్కోలు పలికేందుకు పీసీబీ ఇటీవల భావించింది. ఆ జాబితాలో వెటరన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో పాటు సయీద్ అజ్మల్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే జాతీయ టీ20 కప్ లో తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నానని చెప్పాడు. ఈ ఫిట్ నెస్సే తనకు జట్టులో అవకాశం కల్పించేలా చేస్తుందని, ఒకవేళ, తాను నిరూపించుకోలేకపోతే టీమ్ నుంచి తాను స్వచ్ఛందంగా తప్పుకుంటానని.. దేశవాళీ క్రికెట్ లో తన సత్తా చాటుకుంటానని చెప్పాడు. కాగా, అజ్మల్ బౌలింగ్ సరళి నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతో 2014లో అతనిపై అంతర్జాతీయంగా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ తీరును సరిచేసుకున్న అజ్మల్ గత ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే, అతని బౌలింగ్ లో మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి నిషేధం ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్ల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న అజ్మల్ ఈ ఏడాది పాక్ జాతీయ టీ20 లో ఇరవై వికెట్లు తీసుకుని అగ్రస్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News