: ఐఎస్ఐఎస్ అరాచకం... పెళ్లి కట్నంగా తుపాకులు, బెల్టు బాంబులు!
ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అరాచకాలు రోజురోజుకీ శృతి మించుతున్నాయి. వారి మెదళ్లలో కర్కశత్వం ఏ రీతిన నాటుకుపోయిందో వెల్లడించే ఘటన లిబియాలో చోటుచేసుకుంది. ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న కోస్తా పట్టణమైన సిర్టేను వారి నుంచి స్వాధీనం చేసుకున్న అనంతరం లిబియా సైన్యం జరిపిన తనిఖీల్లో కొన్ని డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆ డాక్యుమెంట్లను పరిశీలించిన సైన్యం వాటిల్లోని వివరాలు చూసి షాక్ తింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వివాహానికి కట్నంగా తుపాకులు, ఆత్మాహుతి దాడుల్లో వినియోగించే బెల్టు బాంబులను ఇచ్చిపుచ్చుకున్నట్టు తేలింది. అంతే కాకుండా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జీహాదీలకు జ్యుడిషియల్, కంప్లయింట్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించేవారని, అందులోనే వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు పరిష్కరించేవారని లిబియా సైనికులు చెబుతున్నారు. 2015 నవంబర్ 31న జరిగిన వివాహ డాక్యుమెంట్లలో నైజీరియాకు చెందిన మిరియం అనే మహిళను వివాహం చేసుకునేందుకు అబు మౌన్సర్ అనే ట్యూనీషియా పురుషుడు తాను మరణించినా, లేదా విడాకులు తీసుకున్నా మిరియంకు బెల్టుబాంబును కట్నంగా ఇస్తానని పేర్కొన్నట్టు ఉంది. అలాగే ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్న జీహాదీ ఆమెకు కట్నంగా కలష్నికోవ్ రైఫిల్ ఇస్తానని పేర్కొన్నాడని వారు తెలిపారు. కాగా, ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలంటే ముందు యువతికి కట్నం ఇవ్వాల్సి ఉంటుంది.