: ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకంగా పనిచేస్తా!: బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్
బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆ బోర్డులోని సెలెక్షన్ కమిటీ సభ్యుడు, గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. టాలెంట్ ఎక్కడ ఉన్నా తాను గుర్తిస్తానని చెప్పారు. తెలుగు క్రికెటర్లకు అన్యాయం జరుగుతోందని వస్తోన్న వ్యాఖ్యలను ఆయన కొట్టేశారు. దేశ ప్రయోజనాల కోసమే సెలెక్టర్లు పనిచేస్తారని, ప్రతిభ ఉన్నవారందరినీ ప్రోత్సహిస్తారని చెప్పారు. తెలుగురాష్ట్రాల క్రికెటర్లు రాణిస్తే వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. మనం చేసే పనిని బట్టే మనకు గుర్తింపు వస్తుందని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంపిక ఉంటుందని చెప్పారు. తెలుగువాడిగా అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. టాలెంట్‌ని గుర్తించడమే సెలెక్టర్ల బాధ్యత అని పేర్కొన్నారు. ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకంగా పనిచేస్తానని అన్నారు. తాను ఏడాది కాలంలోనే బీసీసీఐ నమ్మకాన్ని పొందినట్లు చెప్పారు. మనం చేసే పనితోనే మనపై అధికారులకు నమ్మకం వస్తుందని చెప్పారు. తన లక్ష్యం ఒక్కటేనని, రానున్న అన్ని ఫార్మాట్లలో పాల్గొనడానికి మంచి టీమ్‌ను సెలెక్ట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. రేపు జరగనున్న 500వ టెస్ట్ ను చూడడానికి కాన్పూర్ వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. సందీప్ పాటిల్ స్థానంలో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.