: నష్టం మనకే... ఈ ఏడాది ఉగ్రపోరులో 31 మంది ఉగ్రవాదులు మరణిస్తే, అమరులైంది 64 మంది వీర జవాన్లు!
ఉగ్రవాదంపై పోరులో, ఉగ్రవాదులు జరుపుతున్న దాడిలో అధికంగా నష్టపోతున్నది ఇండియానేనని స్పష్టమవుతోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ ఉగ్రవాదుల చేతుల్లో 64 మంది జవాన్లు మరణించినట్టు ఎస్ఏటీపీ (సౌత్ ఆసియా టెర్రరిజమ్ పోర్టల్) వెల్లడించింది. ఇదే సమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి 31 మంది ఉగ్రవాదులు మాత్రమే మరణించారని చెప్పింది. గడచిన ఆరేళ్లలో ఇంత అధికంగా భారత్ తన జవాన్లను పోగొట్టుకోలేదని తెలిపింది. 2007 నుంచి 2012 వరకూ ఉగ్రవాదుల సంఖ్యతో పోలిస్తే జవాన్ల మరణం తక్కువగా ఉండగా, గడచిన మూడేళ్లలో మాత్రం ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అధిక సంఖ్యలో జవాన్లు ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొంది. వాస్తవాధీన రేఖ వద్ద 1990 నుంచి 2007 మధ్య సగటున 800 మంది పౌరులు మరణించగా, అదిప్పుడు గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంది. గత సంవత్సరం 33 చొరబాటు యత్నాలు జరుగగా, 37 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిందని, ఈ సంవత్సరం ఇప్పటివరకూ 54 చొరబాటు ఘటనలు చోటు చేసుకోగా, 31 మందినే హతమార్చారని పేర్కొంది.