: హైదరాబాద్‌లో మ్యాన్హోల్స్ తెరిస్తే కఠిన చర్యలు తప్పవు: సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈరోజు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. నగరంలో సహాయక చర్యలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. వాటి కోసం 220 మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయని పేర్కొన్నారు. వర్షాల ధాటికి మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకి భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ మార్గ్లో రోడ్డుపై ఏర్పడిన గుంతపై స్పందించిన ఆయన పైప్లైన్ పగలడమే దారికి కారణమని చెప్పారు. తమ అనుమతి తీసుకోకుండా నగరంలో ఎవ్వరూ రోడ్ల మీది మ్యాన్హోల్స్ను తెరవకూడదని ఆయన చెప్పారు. దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వర్షాల వల్ల నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 100 లేదా 040-21111111 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని, తమకు వస్తోన్న ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. శిథిలావస్థ భవనాల్లో నివసించే వారు వాటిని స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని కోరారు. ట్యాంక్ బండ్ వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను తాము పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.